'దర్గా'లో సీతారాముల కల్యాణం.. ఉర్సుతో పాటు నవమి వేడుకలు
sitarama kalyanam in dargah: మతసామరస్యానికి ఆదర్శంగా దర్గాలో సీతారాముల కళ్యాణం జరిగింది. దర్గాలో సీతారాముల కల్యాణం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! కానీ ఇది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. ముచ్చటగా ఈ ఏడాది కూడా దర్గాలో మతసామరస్యానికి ప్రతీకగా సీతారామ కల్యాణం జరగటం ప్రత్యేకతగా నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గత 40 సంవత్సరాలుగా సత్యనారాయణపురం సమీపంలో హజరత్ నాగుల్ మీరా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో శ్రీరామనవమి వేడుకలను కూడా అంతే ఘనంగా జరుపుతున్నారు. ఇక్కడ కుల మత బేధం లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మనుషులంతా ఒకటే అనే సూక్తితో దర్గాలో పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. హిందూ, ముస్లింలు అంతా కలిసి హజరత్ నాగుల్ మీరాతో పాటు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున దర్గాలో రాములోరి కల్యాణం జరిపించడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ దర్గా పూజారి( మాలిక్) కూడా హిందువు కావడం మరో విశేషం. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణాన్ని బ్రాహ్మణ పూజారులచే సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాల నడుమ జరుపుతూ వస్తున్నారు. రేపు సీతారామ పట్టాభిషేక కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.