దుర్గమ్మకు బంగారం, వెండి కలబోసిన చీర.. నేతన్న కోరిక తీరేనా..? - telangana latest updates
Sircilla weaver presents golden saree to Vijayawada Kanakadurga : విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మవారికి బంగారు, వెండి కలబోసిన చీరను సిరిసిల్ల చేనేత కార్మికుడు సమర్పించారు. నేత కార్మికులు మరుగున పడకూడదంటూ దేవతను ప్రార్థించినట్లు కార్మికుడు నల్ల విజయ్ పేర్కొన్నారు. గతంలో చీరలు నేయడంలో ఎన్నో ప్రయోగాలు చేసి సిరిసిల్ల నేత కార్మికుల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. ఇటీవల తిరుమల శ్రీవారికి వస్త్రాలు సమర్పించామని తెలిపారు.
ఇప్పుడు అదే తరహాలో 5 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసిన చీరను అమ్మవారికి సమర్పించారు. ఈ చీర ఖరీదు రూ. 45 వేలు ఉంటుందని విజయ్ తెలిపారు. అమ్మవారి ఆశీర్వచనంతో ఇప్పుడు తాను చీరను తయారు చేయగలిగానని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేసి సిరిసిల్లా నేత కార్మికుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నామని అన్నారు. ఎన్నో రోజులుగా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవాలని అనుకుంటున్నానని..చివరకు తన కోరిక తీరిందని విజయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.