Coal production stopped : వర్షాలతో వల్ల రూ.27 కోట్ల నష్టం.. ఇలాగే కొనసాగితే..
Singareni Losses Due to Rains : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రెబ్బెన, తిర్యని మండలాల్లోని బెల్లంపల్లి ఏరియా ఉపరితల గనుల ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఈ ఏరియాలో ఒక రోజుకు పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా.. ఈనెల 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 2.7 టన్నుల బొగ్గుకు గాను 1,83,000(67%) ఉత్పత్తి సాధించింది. 87 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం పడని సమయములో అప్పుడప్పుడు బొగ్గు ఉత్పత్తి చేసినప్పటికీ గడిచిన 27 రోజుల్లో సుమారు రూ.26 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ఏరియా డీజీఎం ఉజ్వల్ కుమార్ తెలిపారు. అధిక వర్షంతో ఈనెల 26, 27వ తేదీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. శుక్రవారం మొదటి షిఫ్ట్‌లో కూడా ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో మరో కోటి నష్టం జరిగిందని.. దాదాపుగా బెల్లంపల్లి ఏరియాలో 27 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలాగే భారీ వర్షాలు కొనసాగితే సింగరేణి సంస్థ కోట్లల్లో నష్టపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.