Srinivas Goud on Buddha Purnima : 'తెెలంగాణకు అద్భుతమైన బౌద్ధ చరిత్ర' - మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud on Buddha Purnima : తెలంగాణ ప్రాంతానికి అద్భుతమైన బౌద్ధ చరిత్ర ఉందని, ఎక్కడ తవ్వకాలు జరిపినా బయటపడుతున్న ఆధారాలే ఇందుకు నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతం మనం అనుకున్న స్థాయిలో మనం ప్రపంచానికి తెలియపరచలేక పోయామన్నారు. మనం తెలియజేసి ఉంటే.. అనేక మంది బౌద్ధులు మన దేశానికి వచ్చి ఉండేవారన్నారు. ఈ ప్రాంత విశిష్ఠతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వరకు వందకుపైగా కార్లతో ఈ శాంతి ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి మంత్రితో కలిసి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఎండీ మనోహార్ పూలమాలలు వేశారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన బుద్ధ వనాన్ని నాగార్జున సాగర్ దగ్గర ప్రభుత్వం నిర్మించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.