Heavy Rains in Hyderabad : నగరంలో పొంగిపొర్లుతున్న నాలాలు.. జలదిగ్బంధంలో పలు కాలనీలు - హైదరాబాద్‌లో భారీ వర్షం
Heay Rains in Hyderabad Today : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లడంతో మూతలు పైకి తేలాయి. జనం రోడ్డుపై నడవలేని పరిస్థితి తలెత్తింది. అలాగే పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. భారీ వర్షానికి గాజులరామారం పెద్దచెరువు పొంగిపొర్లింది. దాంతో వరద నీరు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తుండటంతో నిన్నటి నుంచి గాజులరామారంలోని వీనస్‌కాలనీ, ఓక్షిత్ ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం అత్యావసరమైన పాలు, కూరగాయలు తెచ్చుకుందామన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాతావరణ అధికారులు ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ఆ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.