'మేం వెళ్లిపోతున్నాం.. మా పిల్లలు జాగ్రత్త..' దంపతుల సెల్ఫీ వీడియో - Selfie video of couple commit suicide in vishaka
Couple Selfie Video: ‘మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం.. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమైన అన్నా.. పిల్లలూ పట్టించుకోకండి’ అని సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతులు దాన్ని బంధువులకు పంపి.. వారు కనిపించకుండా పోయారు. ఈ ఘటన విశాఖపట్నంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. దంపతులు వర ప్రసాద్, మీరా ఆత్మహత్య చేసుకుంటున్నామని విలపిస్తున్న వీడియోను పిల్లలు, బంధువులకు సెండ్ చేశారు. ఆ తరువాతం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎటో వెళ్లిపోయారు. దీనిపై కుమారుడు కృష్ణసాయి తేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొప్పాక ఏలేరు కాల్వ వద్ద చెప్పులు, బైక్ కనిపించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. గజ ఈతగాళ్లతో ఏలేరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా.. అనకాపల్లి జిల్లా రాజుపాలెం ఏలేరు కాల్వలో బుధవారం ఉదయం దంపతుల మృతదేహలు లభ్యమయ్యాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్-2 విభాగంలో పని చేస్తున్న చిత్రాడ వర ప్రసాద్ (47), మీరా(41) దంపతులు 87వ వార్డు తిరుమలనగర్ సమీపంలోని శివాజీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు కృష్ణసాయి తేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉన్నారు. వర ప్రసాద్ అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో గత కొద్ది రోజులుగా రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.