Security defects: భద్రతాలోపం.. చంద్రబాబు కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చిన వైసీపీ వాహనాలు
Security defects in Chandrababu Convoy: తెలుగుదేశం అధినేత చంద్రబాబు వాహనశ్రేణిలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి పర్యటనలో ఉంగుటూరు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైసీపీకి చెందిన వాహనాలు దూసుకొచ్చాయి. వైసీపీ వాహనాలు వచ్చినప్పటికీ.. రాష్ట్ర పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాలు చోద్యం చూస్తూ ఉండిపోయాయి. రెండు వైసీపీ వాహనాలు ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు చంద్రాబాబు కాన్వాయ్‌ని అనుసరించాయి. కాన్వాయ్‌లో దూరిన వాహనాలను నియంత్రించకుండా ఎస్కార్ట్ పోలీసులు వదిలేసారు.
అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాటకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శుక్రవారం రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.. చంద్రబాబు అందుకోసమే పశ్చిమ గోదావరికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతాపరమైన రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులవిగా భావిస్తున్న రెండు వాహనాలు చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయిని అనుసరించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబట్టారు. ఆ రెండు వాహనాలను అధికారులు నియంత్రించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న అంశాలకే భద్రత కారణాలు చెప్పే పోలీసులు చంద్రబాబు వాహనాన్ని రెండు వాహనాలు అనుసరిస్తున్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు సంబందించిన వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.