Scorpio Hit And Run in Bangalore : కేసు విత్‌డ్రాకు ఒప్పుకోలేదని కారుతో ఢీకొట్టి హత్య.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి.. - వ్యక్తిని కారుతో ఢీ కొట్టి చంపిన స్నేహితులు
Published : Oct 31, 2023, 3:40 PM IST
Scorpio Hit And Run in Bangalore Man Died : తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోలేదనే కోపంతో ఓ వ్యాపారిని స్కార్పియో కారుతో ఢీకొట్టి మరీ చంపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని పులికేశి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సయ్యద్ అస్గర్.. నగరంలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తుండేవాడు. ఎనిమిది నెలల క్రితం అమిన్ అనే వ్యక్తికి రూ.4 లక్షల విలువైన రెండు కార్లను అమ్మాడు. అయితే ఈ డబ్బును చెల్లించేందుకు సయ్యద్‌ను అమిన్ కొంత గడువు అడిగాడు. గడువు ముగిసినా అమిన్డబ్బులు చెల్లించకపోవడం వల్ల కొద్దిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు వ్యాపారి అస్గర్. ఈ పంచాయితీలో.. అస్గర్‌కు త్వరలోనే డబ్బును చెల్లిస్తానని అమిన్ అంగీకరించాడు.
ఇలా ఒప్పుకున్న తర్వాత కొద్దిరోజులకు అమిన్ తన సహచరులతో కలిసి అస్గర్, అతడి స్నేహితుడు ముజాహిద్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ముజాహిద్. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సయ్యద్ అస్గర్‌పై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు అమిన్. ఇందుకు అస్గర్ ఒప్పుకోకపోవడం వల్ల అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 18వ తేదీ రాత్రి అస్గర్‌ను నగరంలోని SK గార్డెన్‌కు రమ్మని పిలిచాడు. ముజాహిద్ అనే వ్యక్తితో కలిసి చెప్పిన ప్రదేశానికి అస్గర్ వెళ్లాడు. అమిన్ కూడా తన స్నేహితుడు నవాజ్‌తో కలిసి స్కార్పియో కారులో అక్కడకు చేరుకున్నాడు. అక్కడ కూడా కేసును విత్‌డ్రా చేసుకోవాలని మళ్లీ కోరారు.
ఇందుకు అస్గర్, ముజాహిద్ ఇద్దరూ నో చెప్పి బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడే నిలబడ్డ అస్గర్పైకి ఒక్కసారిగా కారును పోనిచ్చారు అమిన్, నవాజ్. వారి నుంచి తప్పించుకునేందుకు సయ్యద్ ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. అలా అస్గర్ మరణించే దాకా అతడిని కారుతో ఢీ కొడుతూనే ముందుకు తీసుకెళ్లారు. చివరకు అస్గర్ మృతిచెందాడని నిర్ధరించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఈ క్రమంలో ముజాహిద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు నిందితులు. ముజాహిద్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పులికేశి నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు అమిన్, నవాజ్‌లపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
TAGGED:
man murdered in bangalore