Scooty Fire Accident : అకస్మాత్తుగా స్కూటీలో చెలరేగిన మంటలు.. - telangana latest news
Scooty Fire Accident in Yadadribhuvanagir District : ఈ మధ్య కాలంలో వాహన అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్లు అగ్ని ప్రమాదానికి గురవడం అప్పట్లో చూశాం. అయితే ప్రస్తుతం కాస్తున్న విపరీతమైన ఎండల కారణంగా సాధారణ వాహనాలు సైతం అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పెట్రోల్ పోయించుకుని వస్తుండగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఆలేరు పట్టణంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు హోండా యాక్టీవా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్దమైంది. బంక్లో వాహనదారుడు స్కూటీలో పెట్రోల్ పోసుకొని తిరిగివెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ పోయించుకుని బంక్ నుంచి బయటకి రాగానే స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్కూటీ దగ్ధం అయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనదారుడు భయంతో వాహనం వదిలి పరుగులు తీసాడు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలేరు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.