డా.బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పించిన రాజాసింగ్ - మండిపడ్డ దళిత సంఘాలు - SC Leaders fight at Tankband Ambedkar Statue
Published : Dec 6, 2023, 6:58 PM IST
SC Leaders Protest against BJP MLA Raja Singh : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాలలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర బీజేపీ, దళిత సంఘం నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇవాళ డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ (Dr.B.R Ambedkar) వర్ధంతి సందర్భంగా విగ్రహానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన రాజాసింగ్‌ను ఎస్సీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది.
కొద్ది సేపటి వరకు ఇరువర్గాల నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి మీడియా విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని గౌరవించని రాజాసింగ్ లాంటి నాయకులకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించే హక్కులేదని మండిపడ్డారు. దళితుల ఆహార అలవాట్లు, జీవనశైలిపై విషం చిమ్మే వ్యక్తి రాజాసింగ్ అని ఆరోపించారు.