సంక్రాంతి సంబురాలు - పల్లెల్లో జోరుగా ఎడ్ల పందేలు - సంక్రాంతి ఎడ్ల పందాలు
Published : Jan 15, 2024, 2:42 PM IST
Sankranti Edla Pandalu in Asifabad : పల్లెటూరులో సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇక సందడే సందడి. కొన్ని గ్రామాల్లో పూర్వీకుల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా పాటిస్తూ వస్తున్న కొన్ని ఆనవాయితీలుంటాయి. పండుగను పురస్కరించుకుని కొన్ని ఊళ్లలో కోడి, ఎడ్లు, పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని చట్టవిరుద్ధమైనవీ ఉన్నాయి. కానీ ఎడ్ల పందేలు నిర్వహించడం మాత్రం తరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ నదీ తీరాన సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఎడ్ల పందేలను ఘనంగా నిర్వహించారు.
Bulls Race Competition In Asifabad: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఘనంగా ఎడ్ల పందేలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ ఎడ్ల పందేళ్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉత్సాహాన్ని చూపించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ పందేల్లో గెలిచిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా ఐదువేల ఒక్క రూపాయిలు, ద్వితీయ బహుమతిగా మూడువేల ఒక్క రూపాయిలను అందజేశారు. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు.