sand art Of Ambedkar : అద్భుతంగా అంబేడ్కర్ శాండ్ ఆర్ట్.. - ఇసుక కళ
అంబేడ్కర్...! ఆ పేరు వింటే చాలు కోట్లాది మందికి తెలియని ధైర్యం.. ఆయన విగ్రహాన్ని చూస్తే చాలు మరెంతో మందికి తెలియని భరోసా... అలాంటి విగ్రహాలు దేశమంతా చాలానే ఉన్నాయి. వాటన్నింటిని మించి 125 అడుగుల భారీ విగ్రహం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆవిష్కృతం అవుతోంది. ఏడు సంవత్సరాల క్రితం మెదిలిన ఆలోచనకు అనుగుణంగా అతి పెద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ భారీ విగ్రహం ఠీవిగా దర్శనమివ్వబోతోంది. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ రానున్నారు.
హైదారాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ వినూత్నంగా అభినందనలు తెలిపారు. అంబేద్కర్ భారీ విగ్రహం ప్రత్యేకతల్ని సంక్షిప్తంగా వివరిస్తూ శాండ్ ఆర్ట్ రూపొందించారు. కోటి రతనాల వీణ తెలంగాణా, జై భీం, జై భారత్ నినాదాలు ఆ వీడియోలో పొందుపరిచారు. ఎంతో అద్భుతంగా శాండ్ ఆర్ట్‌ను రూపొందించారు.