పంబాకు వాహనాలు నో ఎంట్రీ- రోడ్డుపైనే పాటలు పాడుతూ అయ్యప్ప భక్తుల ఆందోళన - శబరిమలలో భక్తుల రద్దీ
Published : Dec 13, 2023, 1:04 PM IST
Sabarimala Rush News Today : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శబరిమలకు భక్తులు పొటెత్తడం వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్ల పంబాకు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు అధికారులు. ఫలితంగా మంగళవారం రాత్రి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రోడ్డుపైన నిరసన చేపట్టారు. ఎరుమెలి- పంబా రోడ్డుపై అయ్యప్ప పాటలు పాడుతూ ఆందోళన నిర్వహించారు. పంబాకు వాహనాలు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు. భక్తుల రద్దీ అదుపులోకి వచ్చాక వాహనాలను అనుతిస్తామని హామీ ఇవ్వడం వల్ల భక్తులు వెనక్కితగ్గారు. భక్తుల ఆందోళనలపై దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణన్ స్పందించారు. మంగళవారం రాత్రి నెలకొన్న సమస్యలను పరిష్కరించామని చెప్పారు. భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను సైతం వినియోగిస్తామని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆన్లైన్ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.