2వేల మందికి MP మటన్ రైస్ విందు.. ఒక్కసారిగా తొక్కిసలాట.. డీఎస్పీకి గాయాలు - lalan singh mutton biryani party
కార్మికుల కోసం మటన్ రైస్‌తో ఓ ఎంపీ ఏర్పాటు చేసిన విందులో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో డీఎస్పీకి.. కిందపడి స్వల్ప గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జరిగిందీ ఘటన.
ముంగేర్ జిల్లాలోని పోలో గ్రౌండ్‌లో జేడీయూ జాతీయాధ్యుక్షుడు, ముంగేర్ ఎంపీ లాలన్ సింగ్ దినసరి కూలీల కోసం మటన్ కూరతో కమ్మనైన విందును ఏర్పాటు చేశారు. మటన్ రైస్‌ను తినేందుకు ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రద్దీని అదుపు చేసే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిపై లాఠీలు ఝులిపించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
విందులో కూలీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడకు కొందరు జేడీయూ పార్టీ కార్యకర్తలు కూడా రావడం వల్ల తోపులాట జరిగింది. అయితే కేవలం రెండు వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అంతకు మించి ప్రజలు రావటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు నిర్వాహకులు. మొదటి పంక్తి భోజనం ప్రశాంతంగా ముగిసినా రెండో రౌండ్ సమయానికి జనాలు కిక్కిరిసి పోవడం వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
2019లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లాలన్ సింగ్ ఇలాంటి విందులు చాలా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. మహమ్మారి ముప్పు తగ్గడం వల్ల ఈసారి ముంగేర్ వేదికగా ఏకంగా రెండు వేల మంది కోసం మటన్ రైస్ విందును ఏర్పాటు చేశారు.