Nalgonda Accident Today : నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టిన RTC బస్సు.. అందులో 43 మంది ప్రయాణికులు - ఏపీ లింగోటం జాతీయ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
RTC Bus Accident in Nalgonda : రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. మరికొందరు గాయాల పాలై.. ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు.. హైదరాబాద్ నుంచి కోదాడకు వెళ్తుండగా ఏపీ లింగోటం శివారు వద్ద వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.