RS Praveen kumar comments on KCR : దళిత బంధు పథకంలో కమీషన్లు - Jogulamba Gadwal latest news
RS Praveen kumar comments on KCR : ప్రభుత్వం దళిత బంధు పథకంలో రూ.10 లక్షలు మంజూరు చేస్తుంటే ఎమ్మెల్యేలే రూ.3 లక్షల కమీషన్లు తీసుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయం స్వయంగా సీఎం కేసీఆర్ కు తెలిసినా.. వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆరే ప్రజల సొమ్ము తినండి అని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శించారు.
బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోనీ కొయిలదిన్నె, జిల్లేడుదిన్నెలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర నిర్వహించారు. గద్వాలలో బహిరంగ సభ అత్యంత పేలవంగా జరిగిందని అన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభం కోసం వచ్చిన సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన పేద ప్రజలకు.. కారంతో అన్నం పెట్టి అవమానించడం బీఆర్ఎస్ నీచ సంస్కృతికు అద్దం పట్టిందంటూ మండిపడ్డారు. సీఎం సభలకు జనాలు రావడం లేదని అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలను మామూలు దుస్తుల్లో హజరు కావాలని అధికారులు చేసిన ఒత్తిడితో వారు సభకు వెళ్లారని ప్రవీణ్ కుమార్ స్పందించారు.