రూ.7.4 కోట్ల నగదుపై ఖమ్మంకు చెందిన నేత బంధువుకు నోటీసులు - తెలంగాణ ఎన్నికల్లో ఏడు కోట్ల నగదు స్వాధీనం
Published : Nov 19, 2023, 8:48 PM IST
Rs 7 Crores Money Seized in Telangana Election 2023 : మెయినాబాద్ పీఎస్‌లో పట్టుబడిన నగదు కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మెయినాబాద్ పోలీసులు 10మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నారు. అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌజ్‌లో మహేందర్ అనే వ్యక్తి రూ.7.4కోట్లను ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును బ్యాగులలో పెట్టుకొని ఫామ్‌హౌజ్ నుంచి కార్లలో బయటికి వచ్చారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు అనుమానం వచ్చి కార్లను తనిఖీ చేయగా పెద్దమొత్తంలో డబ్బు బయటపడింది.
ఈ నగదును సీజ్ చేసిన మెయినాబాద్ పోలీసులు.. రేపు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం ఐటీ అధికారులు సైతం మహేందర్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌తో పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలతో పాటు.. లాకర్ కీలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే డబ్బును ఖమ్మం పంపేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు