చేపలనూనె డబ్బాల మధ్యలో బంగారం స్మగ్లింగ్ - విమానాశ్రయంలో రూ 65లక్షల బంగారం పట్టివేత
Gold smuggling: బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు.. రోజుకో కొత్త దారులను వెతుక్కుంటున్నారు. వారు ఎన్ని విధాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిద్దామని చూసినాసరే.. కస్టమ్స్ అధికారులు మాత్రం వారిపై జూలువిదుల్చుతున్నారు. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.24 కేజీలు బరువు ఉండి రూ. 66.24 లక్షల విలువ చేసే గోల్డ్‌ను పట్టుకున్నారు. వీరిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఈరోజు తెల్లవారు జామున 02:55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు వివరించారు. అనుమానం వచ్చి ప్రయాణికుడిని తనిఖీ చేయగా 3 క్యాప్సల్స్ రూపంలో ఉన్న బంగారం పేస్టుగా ఉండడాన్ని గుర్తించారు.
మరోవైపు ఇంకొక వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 03:45 గంటలకు దుబాయ్ నుంచే వ్యక్తిని అనుమానం వచ్చి బ్యాగ్ తనిఖీ చేయగా.. టూనా చేపల నూనె డబ్బాల మధ్య పెట్టుకుని 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరి ఇద్దరినీ ఇండియన్ కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.