Roads Damaged in Jagtial District : భారీ వర్షాలు.. తెగిపోయిన రోడ్లు, వంతెనలు.. నిలిచిపోయిన రాకపోకలు
Roads and Bridges Cut in Jagtial :జగిత్యాల జిల్లాలో వర్షం వచ్చిందంటే జనం అల్లాడిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈసారి కురిసిన భారీ వర్షాలకు వంతెనలు మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. రహదారులు, వంతెనలు తెగిపోవటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనంతారం జాతీయ రహదారి వంతెన తెగిపోవటంతో జగిత్యాల నుంచి ధర్మపురి, మంచిర్యాల వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ఇది జాతీయ రహదారి కావడంతో ధర్మపురి-మంచిర్యాల రహదారి నుంచే ఎక్కువ శాతం మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వర్షాల ధాటికి అటు వైపు వెళ్లే వారు గొల్లపల్లి, శెక్కల్ల, కల్లెడ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఆర్టీసీ సైతం ఇదే మార్గంలో నడుపుతోంది. సారంగపూర్ పెంబట్ల వద్ద నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవటంతో జన్నారం, సారంగపూర్ వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు రాయికల్ మండలంలో తెగిపోయిన రోడ్లు, వంతెనలతో నిర్మల్, ఖానాపూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతినటంతో అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.