అప్పుడే నిర్మించిన రోడ్డును ఎత్తుకెళ్లిన స్థానికులు, 3కిలోమీటర్ల రహదారి మాయం - జహానాబాద్ రోడ్డు లూటీ
Published : Nov 4, 2023, 8:45 AM IST
|Updated : Nov 4, 2023, 9:55 AM IST
Road Loot In Bihar : బిహార్లో జహానాబాద్లో కొత్తగా నిర్మించిన రోడ్డును గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును లూటీ చేసేశారు. నిర్మాణం కోసం ఉంచిన సామగ్రిని కూడా దోచేశారు. ప్రజలు రోడ్డును ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి సడక్ గ్రామ్ యోజన పథకం క్రింద జహానాబాద్ జిల్లాలోని ఔదాన్ గ్రామంలో కొత్తగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే రోడ్డు వేశాక అక్కడికి స్థానికులు కొంతమంది వచ్చారు. రోడ్డును తవ్వుకుంటూ ఎత్తుకెళ్లారు. అలానే రహదారి నిర్మాణం కోసం అక్కడ ఉంచిన సామగ్రిని కూడా తీసుకెళ్లారు. ఇలా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును మాయం చేసేశారు. రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నిర్మాణ పనులు చేపట్టిన ప్రతిసారి కొంతమంది స్థానికులు వచ్చి సామగ్రిని దోచుకుంటున్నట్లు సమాచారం.