Hydernagar Road Damage : హైదర్‌నగర్‌లో కుంగిన రహదారి.. భయాందోళనలో స్థానికులు - హైదర్‌నగర్‌లో కుంగిన రహదారి
Road Damage In Hydernagar :రుతుపవనాల రాకతో హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చినుకు పడగానే నగరంలోని కొన్ని ప్రాంతాలు చిత్తడవుతున్నాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే నాలాలు పొంగడం.. రహదారులు చెరువులుగా మారడం ఖాయం. కొన్ని ప్రాంతాల్లో నాణ్యత లేని రహదారులు కోతలకు గురవడం సర్వసాధారణం. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో అకస్మాత్తుగా రహదారి కుంగింది. అయితే దీనికి కారణం మాత్రం వర్షాలు కాదు. ఇంతకీ రహదారి ఎందుకు కుంగిపోయిందంటే..?
కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో రహదారి కుంగిపోవడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. సగం పైగా రహదారి కుంగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల భారీ నిర్మాణాల కోసం ఆ ప్రాంతంలో ఓ నిర్మాణ సంస్థ పునాదులు తవ్వింది. ఈ క్రమంలో ఇవాళ ఒక్కసారిగా రహదారి కుంగిపోయింది. ఇది చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ వైపుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక వాహనదారులు అటుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమై.. కుంగిన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.