ఒకే కుటుంబంలో 10 మంది మృతి.. వరుసగా గొయ్యి తవ్వి అంత్యక్రియలు - వైరల్ వీడియోలు
Road Accident In Mysore : కర్ణాటకలో ఒకే దగ్గర తొమ్మిది మంది కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరిగాయి. సోమవారం ఓ కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా బళ్లారి జిల్లాలోని సంగనకల్లు గ్రామానికి చెందిన వారు. అయితే, మంగళవారం వీరి అంత్యక్రియలు సామూహికంగా నిర్వహించారు.
సోమవారం మైసూరు జిల్లాలోని టి.నరసిపుర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బళ్లారికి చెందిన ఈ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్‌నకు బయల్దేరింది. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరు సైతం గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో చిక్కుకున్నవారిని బయటకు తీయడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.