Road accident at Adibhatla : మద్యంమత్తు వల్లే ఆదిభట్ల రోడ్డు ప్రమాదం.. - Measures to prevent road accidents
Road accident at Adibhatla : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తాగి ఉండటమే కారణమని తెలిసింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. అర్థరాత్రి సమయంలో ఆగి ఉన్న డీసీఎంను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా పాత మల్లయ్య పాలెంకు చెందిన నాగసముద్రం సాయిరెడ్డి(22), నాగర్ కర్నూలు జిల్లా తోటపల్లి వాసి తుమ్మోజు లక్ష్మయ్య(52), హైదరాబాద్ జియాగూడ చెందిన అహినల్ల మహేష్ కుమార్(23) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాల పాలై స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్(52) తెల్లవారుజామున మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 160గా నమోదైంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.