Road Accident At Medak : మెదక్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు సజీవదహనం - తెలంగాణ న్యూస్
Road Accident on Medak Highway : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అవగాహన కల్పించినా.. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటున్నా.. జరిమానాలు విధిస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అతి వేగం.. మద్యం సేవించి వాహనం నడపటం.. నిద్ర మత్తులో డ్రైవింగ్.. ఇలా పలు రకాల కారణాలతో ప్రమాదాు జరుగుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనాల్లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నార్సింగ్ మండలం కాస్లాపూర్ జాతీయ రహదారిపై ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి మరొక కంటైనర్ లారీ ఢీ కొట్టింది. వెనుక ఉన్న కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. మృతులు కర్ణాటక రాష్టానికి చెందిన నాగరాజు, బసవరాజులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.