అకాల వర్షం.. రైతన్నకు తీరని నష్టం.. కంటతడి పెట్టిస్తున్న అన్నదాతల ఆవేదన
Crops Damaged Due to Rains : ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. వర్షార్పణం అవడంతో రైతులు నష్టపోతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నూర్పిడి చేసిన వరి పంట తడిసింది. బోధన్ డివిజన్ పరిధిలో వరి కోతలు ముందుగానే మొదలవుతాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం అవ్వడంతో కొందరు రైతులు రహదారులపై పంటను ఆరబోశారు. నియోజకవర్గంలోని బోధన్, ఎడపల్లి మండలంలో వరి కోతలు సగానికి పైగా పూర్తయ్యాయి.
వాతావరణంలోని మార్పులను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో అన్నదాత నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముదామని.. ఈసారైనా చేతికి పెట్టుబడి వస్తుందన్న ఆశ ఆవిరైపోయింది. ఎంతో సంతోషంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చినా పంట లాభాన్ని ఇస్తుందని ఎదురు చూస్తున్న అన్నదాతలకు కన్నీరే మిగిలింది. అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.