Internal Disputes in Ramagundam BRS : రామగుండం బీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు
MLA Seat Politics In Ramagundam : రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలంటూ ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటికి టికెట్ ఇవ్వవద్దంటూ వ్యతిరేక స్వరం కూడా పెంచారు. మేయర్ డివిజన్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి, మాజీ కౌన్సిలర్ పాతిపెల్లి ఎల్లయ్యతో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. పార్టీలో సమన్వయం పూర్తిగా లోపించిందని.. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏ అభివృద్ది కార్యక్రమానికైనా పార్టీ నాయకులను ఆహ్వానించడం లేదని తెలిపారు. కోరుకంటి చందర్‌కు టిక్కెట్ ఇస్తే మాత్రం తాము పని చేయబోమని తెగేసి చెబుతుండటంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కినట్లయింది. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడలని ప్రజా యాత్ర చేస్తున్నట్లు చెబుతూనే.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయడమే కాకుండా బహిరంగ లేఖను సంధించడం ఆసక్తిగా మారింది.