తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి - రేవంత్‌రెడ్డి దంపతులకు ఆశీర్వచనం అందించిన పండితులు
Published : Nov 12, 2023, 2:04 PM IST
Revanth Reddy Visits Tirumala With Family : తిరుమల శ్రీవారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి మెుక్కులు చెల్లించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు.
అలాగే ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని ప్రపంచంతోనే పోటీపడేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఈ నెల 15 తర్వాత పార్టీ అగ్ర నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీతో పాటు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం చేయనున్నారు.