'నాడు హైదరాబాద్‌లో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో కాంగ్రెస్ అణచివేసింది అందుకే ఇవాళ ఇంత ప్రశాంతత' - జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం
Published : Nov 21, 2023, 10:10 PM IST
Revanth Reddy Road Show at Jubilee Hills : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోరు చివరి దశకు చేరడంతో.. పార్టీల ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుడిగాలి పర్యటనలతో విజయభేరి సభలు.. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల సభలు అనంతరం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్ షోలో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది కాంగ్రెస్ అని.. అందుకే హైదరాబాద్ నగర ప్రజలు శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు.
పక్క గల్లీకి వెళితే కుక్క కూడా గుర్తుపట్టని పక్క పార్టీ వ్యక్తి.. అజారుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చారని అంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వ్యక్తి.. దేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అజారుద్దీన్ అని రేవంత్ వివరించారు. మోదీని ఎంత మంది గుర్తుపడతారో.. అజారుద్దీన్‌ను అంతే మంది గుర్తుపడతారని ఉద్ఘాటించారు. అలాంటి అజారుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెట్టిందని వివరించారు. భారీ మెజారిటీతో తమ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.