కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి - కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
Published : Nov 17, 2023, 9:43 PM IST
Revanth Reddy Janasabha in Kodangal : మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలిస్తే తన మనవడ్ని కూడా మంత్రిని చేస్తాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల పిల్లలు, మనవళ్లను మంత్రులను చేయడానికేనా ప్రజలు కేసీఆర్కు ఓటు వేసిందని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి పేదలకు అండగా ఉంటానని తెలిపారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బొంరాసుపేట, దుద్యాల, కొత్తపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జనసభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. కేసీఆర్ పాలనలో కనీసం జిల్లాకు ఒక డిగ్రీ కళాశాలైనా ఏర్పాటు చేయలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఉండటానికి ఫామ్ హౌస్లు ఉన్నాయి కానీ.. మన ప్రాంతంలో మాత్రం వంద పడకల ఆసుపత్రి నిర్మించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.