'ఈవీఎంలు మార్చి గత ఎన్నికల్లో ధర్మపురిలో బీఆర్‌ఎస్ గెలిచింది' - ధర్మపురి కాంగ్రెస్ బహిరంగ సభ
Published : Nov 11, 2023, 7:09 PM IST
Revanth Reddy Fire on Koppula Eshwar : ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బీఆర్‌ఎస్ గెలిచిందని.. అడ్లూరి లక్ష్మణ్‌ను ఓడించడానికి కేసీఆర్ కుట్ర చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మపురిలో గెలిచిన ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు. ధర్మపురిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని.. ప్రసంగించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపులో 9 వస్తువులు వచ్చేవని.. కానీ బీఆర్‌ఎస్ పాలనలో బియ్యం తప్ప ఏమీ రావట్లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని అన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డలో ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిపోయిందని.. ఇది కేసీఆర్ పనితనమని అన్నారు.
Telangana Assembly Election 2023 :ఇంటింటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని మాట ఇచ్చారు. కౌలు రైతులకు కూడా రూ.15 వేలు, రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఉద్యోగాలు, ఇళ్లు, పింఛన్ రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు.