కమలం పార్టీకి వేసే ప్రతి ఓటు కారు గుర్తుకు వేసినట్లే : రేవంత్ రెడ్డి - కల్వకుర్తిలో రేవంత్రెడ్డి ప్రచారం
Published : Nov 25, 2023, 7:17 PM IST
Revanth Reddy Election Campaign at Kalwakurthy :హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టిందీ హస్తం పార్టీ అని గుర్తు తెలిపారు. సంగారెడ్డికి అధిక పరిశ్రమలను తెచ్చి.. ఉపాధి అవకాశాలను కల్పించింది తమ పార్టీ అని గుర్తు చేశారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా గతంలో కేసీఆర్‌ను పాలమూరు నుంచి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రజలను కేసీఆర్ నమ్మించి నట్టేట ముంచారని.. రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్నారు. ఎన్నికల వేళ రైతుబంధు వేస్తామని బీఆర్ఎస్ ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుందన్న ఆయన.. బీజేపీ-బీఆర్ఎస్ కలిసే రైతుబంధు నగదు విడుదలకు అనుమతి తెచ్చుకున్నాయని ఆరోపించారు. దళితబంధు, మైనార్టీ బంధు, బీసీ బంధుకు ఈసీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీలు, దళితులు, మైనార్టీలను మోసం చేశాయన్న రేవంత్.. ఓట్లు చీల్చి బీఆర్ఎస్ను గెలిపించాలని భారతీయ జనతా పార్టీ చూస్తుందన్నారు.