అమ్మ బాబోయ్! ఆమె జడ పొడవు 8 అడుగుల 7 అంగుళాలు
ఉత్తరాఖండ్ హల్ద్వానీకి చెందిన ఓ మహిళ జుట్టును పెంచి రికార్డులు సాధించింది. 36 ఏళ్ల రేణు దరియాల్కు జుట్టును పెంచడం అంటే సరదా. ఆ తర్వాత అదే ఆమె అభిరుచిగా మారింది. ప్రస్తుతం ఆమె జడ పొడవు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. 2015 నుంచి జుట్టును పెంచుతుండగా.. ప్రస్తుతం ఆమె జడ పొడవు 8 అడుగుల 7 అంగుళాలకు చేరింది. దీంతో ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఉత్తరాఖండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు అవార్డులను సంపాదించుకుంది. తన తర్వాతి లక్ష్యం లిమ్కా, గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమేనని చెబుతోంది రేణు.
రేణు చిన్నానాటి నుంచి జుట్టును పెంచుతోంది. అయితే 2015 తర్వాత ఆమెకు అది అభిరుచిగా మారింది. ఆ తర్వాత రోజులో ఒక గంట సేపు కచ్చితంగా జుట్టు సంరక్షణ కోసం కేటాయించడం ప్రారంభించింది. వివిధ రకాల షాంపూలు, రసాయనాలతో కాకుండా.. కేవలం ఇంట్లో లభించే అలోవెరా, ఉసిరి లాంటి పదార్థాలతోనే వెంట్రుకలను శుభ్రం చేస్తోంది రేణు. తాను హెయిర్ డ్రయర్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులను సైతం వినియోగించనని తెలిపింది.