Water Levels in Telangana Projects : శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులకు తగ్గిన వరద ప్రవాహం - నిజమాబాద్ ఎస్సారెస్పీలో తగ్గిన నీటి మట్టం
Reduced Water Flow in SRSP : రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గుతోంది. నిజమాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 39,446 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1082.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 60.631 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కడెం జలాశయానికీ వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీలు కాగా.. గత సంవత్సరం వచ్చిన వరద 3.216 టీఎంసీల నీరు నిలకడగా ఉంది. తాజాగా గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిరంతరం వచ్చిన వరదతో ప్రాజక్టులోకి ఇప్పటివరకు 16 టీఎంసీల నీరు రాగా.. 14 వరద గేట్ల ద్వారా 14.381 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.630 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 8507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 800 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేట్ ద్వారా దిగువకు వదులుతున్నారు.