ఇంట్లో మరిచిపోయిన ల్యాప్‌టాప్ తీసుకొచ్చేందుకు ర్యాపిడో బుక్ చేస్తే - డ్రైవర్ భలే షాకిచ్చాడుగా? - Rapido Driver Laptop Threat
Published : Jan 18, 2024, 1:02 PM IST
Rapido Driver Laptop Hyderabad : అతనో బ్యాంక్ ఉద్యోగి. హడావుడిగా ఉద్యోగ నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లాడు. బ్యాంక్‌కు చేరాక తన ల్యాప్‌టాప్ అవసరం ఏర్పడింది. తాను తిరిగి ఇంటికి వెళ్తే సమయం వృధా అని భావించి ర్యాపిడో ద్వారా ఇంట్లో మర్చిపోయిన ల్యాప్‌టాప్ తెప్పిస్తే సరే అని భావించాడు. వెంటనే ర్యాపిడో బుక్ చేశాడు. ర్యాపిడో డ్రైవర్ తన ఇంటికి వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకున్నాడు. రెండు మూడు గంటలైనా ఇంకా ల్యాప్‌టాప్ డెలివరీ చేయకపోవడంతో అనుమానమొచ్చి డ్రైవర్‌కు కాల్ చేశాడు. అప్పుడు డ్రైవర్ ఇచ్చిన షాక్‌తో కంగుతినడం అతడి వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
Rapido Driver Laptop Destruction Threat :హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అశ్విన్ అనే వ్యక్తి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత తాను ఇంట్లో ల్యాప్‌టాప్ మర్చిపోయిన సంగతిని గమనించి రాపిడో ద్వారా ల్యాప్‌టాప్‌ను తెప్పించడానికి బైక్ బుక్ చేశాడు. అయితేడెలివరీ బాయ్ ఇంటికి వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకున్నాడు. ఎంతసేపయినా ల్యాప్‌టాప్ డెలివరీ చేయకపోవడంతో అశ్విన్ డ్రైవర్‌కు కాల్ చేయగా అతడు ప్లేట్ ఫిరాయించి షాక్ ఇచ్చాడు.
ల్యాప్‌టాప్ కావాలంటే 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ల్యాప్‌టాప్‌లో ఉన్న డేటాను డిలీట్ చేస్తానని బెదిరించాడు. ఏం చేయాలో పాలుపోని అశ్విన్ మొదట షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులను సంప్రదించగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఏపీకి చెంది గోవర్ధన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.