ఆగి ఉన్న బస్సుల్లో భారీగా మంటలు.. 8 బస్సులు దగ్ధం! - ranchi bus fire accident
Ranchi Bus Stand Fire Accident : ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖడ్‌గర్హ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో నిలిపి ఉన్న ఎనిమిది బస్సుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఖడ్‌గర్హ బస్టాండ్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు బస్సులో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అందులో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు బృందాలుగా రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయని వివరించారు. కాగా, గంట తర్వాత వంద మీటర్ల దూరంలో ఉన్న మరో నాలుగు బస్సుల్లోనూ మంటలు చెలరేగాయని అధికారులు వివరించారు.
ప్రమాదం జరిగిన సమయానికి బస్సుల్లో ప్యాసింజర్లు లేకపోవడం వల్ల పెను ముప్పు తప్పినట్లైంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జరిగిన ప్రమాదంలో ఒక బస్సు పూర్తిగా కాలి బూడిద అయ్యింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్రగా స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసు అధికారి ఆకాశ్ భరద్వాజ్ తెలిపారు.