Hanumantha Rao on CM Post : 'రాజీవ్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు'
Hanumantha Rao Interesting Comments on CM Post : అప్పట్లో రాజీవ్ గాంధీ తనను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తన దురదృష్టం వల్లే ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరి చేతితో సెల్ఫోన్ ఉందంటే దానికి కారణం కూడా రాజీవ్ గాంధీనేనని వీహెచ్ చెప్పారు. యువతరాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసిన వ్యక్తి అతనేనని పేర్కొన్నారు. మే 21న సోమాజిగూడలో నిర్వహించిన రాజీవ్ గాంధీ సంతప సభకు ప్రజలందరూ రావాలని కోరారు. హవా ఎక్కడుంటే అక్కడికి రాజకీయ నాయకులు రావాలనుకుంటారని తెలిపారు. ఇప్పుడు దేశంలో.. తెలంగాణలో కాంగ్రెస్ హవానే నడుస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చాలా మంది ఉవ్వీళ్లూరుతున్నారని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్ వాదులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికు చెబుతానని వెల్లడించారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు.. కానీ, పార్టీలోకి రాగానే వారికి పదవులు ఇవ్వొద్దని వీహెచ్ వివరించారు.