Hyderabad Rains : తొలికరి చినుకులతో పులకరించిన భాగ్యనగరం.. పలు ప్రాంతాల్లో వర్షాలు - వర్షాలు హైదరాబాద్‌లో
Hyderabad Rains Today : హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. ఇన్ని రోజులు వేసవి తాపానికి అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన జంట నగరాల వాసులు తొలి చినుకుల భాగ్యం దక్కి.. ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో.. ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీనితో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకాఫూల్, సికింద్రాబాద్, పరేడ్ మైదానం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు, తుంపర్లు పడ్డాయి. అలాగే ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి, నాంపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కూకట్‌పల్లి ప్రాంతంలో చిరుజల్లులు ఆ ప్రాంతవాసులను పులకరించాయి. నగరంలోని కోఠి, అబిడ్స్, బేగంబజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌లలో మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీ, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీనితో అప్పటివరకు వేడిగా ఉన్న నగర వాతావరణం.. ఒక్కసారిగా కూల్ అయిపోయింది.