Rain in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
Rain in many places in Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈరోజు చిరుజల్లులు పలకరించాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఇబ్బంది పడ్డ భాగ్యనగర వాసులు సాయంత్రం వేళ వరుణుడు పలకరించడంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పలకరించాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులతో కూడిన మోస్తరు జల్లులు కురిశాయి. భారీగా ఈదురు గాలులు రావటంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షం కారణంగా నగరంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దుకాణాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.