Rain in Hyderabad: భాగ్యనగరంలో జోరు వర్షం.. కూలిన చెట్లు, విరిగిపడిన స్తంభాలు
Rain in Hyderabad Today : భాగ్య నగరంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్ నారాయణగూడలలో చిరు జల్లులు కురవగా.. ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనదారులు, పాదచారులు కొద్దిసేపు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్, చంపాపేట్, సరూర్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైస్ ప్రాంతాల్లో భారీ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైకోర్టు సమీపంలో చెట్టు నేలకొరిగి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సిటీ కాలేజ్ వెనుక వైపు రోడ్డుపై చెట్టు నేల కొరిగి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. చంపాపేట్లో ఈదురు గాలులకు చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. నడిరోడ్డుపై అవి కూలిపోవడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి కూలిన చెట్లు, స్తంభాలను రోడ్డుపై నుంచి తొలిగించారు. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.