Adilabad Rains News : భారీ వర్షానికి ఉప్పొంగిన వాగు.. నిలిచిన రాకపోకలు - వాతావరణశాఖ సమాచారం
Rains in Adilabad : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తారోడాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వరదలతో వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. వరద పోటెక్కి అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు మార్గం మునిగిపోయింది. గతంలో ఉన్న వంతెనకు పగుళ్లు తేలడంతో గత కొన్ని నెలలుగా వంతెనపై రాకపోకలు నిలిపి వేసి వాగుపై తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా కురిసిన వర్షాలకు తాత్కాలిక రోడ్డు మార్గం వరద నీటితో మునిగిపోయింది. రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఇది తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు. వీటి ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని స్పష్టం చేశారు.