Railway Track In Rain Viral Video : నీట మునిగిన రైలు పట్టాలు.. నదిలా రైల్వేస్టేషన్!.. ఒకేరోజు 19మంది బలి - uttarpradesh 2023 rain news
Published : Sep 11, 2023, 7:41 PM IST
Railway Track In Rain Viral Video :ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రైలు పట్టాలు నీటమునిగాయి. రైల్వేస్టేషన్ ప్రాంగణమంతా నదిలా తలపిస్తోంది. పట్టాలు నీట మునగడం వల్ల రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షపు నీటిని తోడే చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు.
రైల్వేస్టేషన్‌తోపాటు నగరంలో దీనదయాళ్ నగర్, రహత్ నగర్, సివిల్ లైన్ సహ పలు ప్రాంతాల్లో నివాసితుల ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరుణుడి బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తమైందని స్థానికులు చెబుతున్నారు.
24గంటల్లో 19మంది మృతి
మరోవైపు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గత 24 గంటల్లో 19 మంది మృతి చెందినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. పిడుగుపాటు వల్ల నలుగురు మృతి చెందగా.. ఇద్దరు నీటమునిగి మృతి చెందినట్లు పేర్కొన్నారు. హర్దోయ్‌లో నలుగురు, బారాబంకీలో ముగ్గురు, ప్రతాప్‌గఢ్, కన్నౌజ్‌లో జిల్లాలో ఇద్దరు, అమేఠీ, డియోరియా, జలౌన్, కాన్పుర్, ఉన్నావ్, సంభాల్, రాంపుర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర సహాయ కమిషనర్ తెలిపారు. 17వ తేదీవరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక నగరాలు నీట మునగడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. బీజేపీపై మండిపడ్డారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి పేరుతో బీజేపీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. బడ్జెట్‌లో అవినీతి, దోపిడీ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.