R Krishnaiah Met Ponnala in Hyderabad : పొన్నాల లక్ష్మయ్యతో కృష్ణయ్య భేటీ.. ఆ అంశాలపై చర్చ - కాంగ్రెస్ తాజా వార్తలు 2023
Published : Aug 30, 2023, 9:16 PM IST
R Krishnaiah Met Ponnala in Hyderabad :హైదరాబాద్‌లోని నివాసంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఇరువురి మధ్య బీసీలకు 50 శాతంపైగా టికెట్ల కేటాయింపు, సామాజిక న్యాయం వంటి అంశాలపై విస్తృత చర్చ సాగిందని, తెలంగాణలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పన అంశంపై వారు చర్చించుకున్నట్లు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సామాజిక కోణం విస్మరించకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని.. బీసీ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు పొందుపరుస్తామని పొన్నాల పేర్కొన్నారు. గతంలో బీసీలకు ఏవైతే చేయలేదో.. ఇప్పుడు అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని పొన్నాలకు విజ్ఞప్తి చేశానని ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. జనాభా, కులాల ప్రాతిపదికన బీసీలకు టిక్కెట్లు కేటాయించకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని, బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీలో పొన్నాల ఫైట్ చేయాలని కోరానన్నారు. బీసీల వాటా బీసీలకు అన్నిట్లో ఇవ్వాల్సిందేనని, ఈ విషయంపై అన్ని పార్టీలపై ఒత్తిడి తెస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో కూడా కొన్ని డిమాండ్లు పొన్నాల దృష్టికి తీసుకెళ్లానని ఆర్.కృష్ణయ్య తెలిపారు.