Protests at Srinidhi University : శ్రీనిధి యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
Published : Aug 23, 2023, 9:01 PM IST
Srinidhi University Controversy : హైదరాబాద్ శివారు ఘట్కేసర్ మండలంలోని శ్రీనిధి విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు మరోసారి ఆందోళనకు దిగారు. వర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారంతో చేర్చుకుని, తరగతులు నిర్వహిస్తున్నారంటూ.. గత కొన్నిరోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. యాజమాన్యం తీరుతో 290 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ విద్యార్థి సంఘాలతో కలిసి వర్సిటీ వద్ద గొడవకు దిగారు. గత నెల 31న వర్సిటీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. అక్కడి ఫర్నీచర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. ఆగస్టు 15 వరకు గడువు కోరిన యాజమాన్యం.. అయినప్పటికీ స్పందించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగుస్తున్నా యాజమాన్యం చెప్పినట్టుగా విద్యార్థులను కళాశాలకు బదిలీ చేయకపోవటంతో తల్లిదండ్రులు మరోసారి ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా వర్సిటీ వద్దకు చేరుకుంటున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆందోళనల వేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున పోలీసులు అప్రమత్తమై.. పెద్దఎత్తున వర్సిటీ వద్ద మోహరించారు.