పానీపూరీ అమ్ముకుంటున్న డాక్టర్.. ఆస్పత్రికి తాళం వేసి మరీ వ్యాపారం.. ఎందుకంటే.. - పానీపూరి అమ్ముతున్న డాక్టర్
రాజస్థాన్‌కు చెందిన ఓ డాక్టర్.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు. రోగులను పరీక్షిస్తూ.. మందులను ఇవ్వాల్సిన ఆమె.. రోడ్డుపై పానీపూరీ అమ్ముతున్నారు. ఆస్పత్రికి తాళం వేసి మరీ.. దాని ఎదుటే విక్రయిస్తున్నారు. ఆమె ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.
రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సీకార్కు చెందిన డాక్టర్ అనిత అనే వైద్యురాలు.. వినూత్నంగా నిరసన చేపట్టారు. దీక్షలు, ఆందోళనలు చేయకుండా.. తన ఆస్పత్రికి తాళం వేసి.. అక్కడే పానీపూరీ అమ్ముతున్నారు. ఆస్పత్రి బోర్డు తీసేసి 'అనిత పుచ్కావాలీ' అని పానీపూరి దుకాణం బోర్డు పెట్టారు. తన నేమ్ బోర్డ్‌ను సైతం 'అనిత పుచ్కావాలీ, మాజీ ప్రైవేట్ డాక్టర్' అని మార్చుకున్నారు.
మరో వైద్యుడు కూడా తన ఆస్పత్రిని పరోఠా సెంటర్‌గా మార్చారని తెలిపారు డాక్టర్ అనిత. ప్రైవేట్ ఆస్పత్రులు ఆందోళన నడుమే 'రైట్ టూ హెల్త్' బిల్‌ను ఆమోదించింది రాజస్థాన్ ప్రభుత్వం. దీని వల్ల రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. కానీ ఈ బిల్లును రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తున్నాయి. తక్షణమే 'రైట్ టూ హెల్త్' చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.