Professor Kodandaram Meeting With Rahul Gandhi : రాహుల్ గాంధీతో ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ.. రాష్ట్ర రాజకీయ పునరేకీకరణ దిశగా చర్చలు - Telangana Elections 2023
Published : Oct 20, 2023, 7:46 PM IST
Professor Kodandaram Meeting With Rahul Gandhi :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సమావేశమయ్యారు. ఉదయం కరీంనగర్ వేదికగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే రాహుల్‌తో సమావేశమైనట్లు కోదండరాం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయి.. సమీకరణాలు ఏవిధంగా మారుతున్నాయన్న దానిపై చర్చలు జరిపినట్లు టీజేఎస్ అధ్యక్షుడు వివరించారు.
ముఖ్యంగా రాష్ట్రం ఒక నిరంకుశ పాలనలో మగ్గిపోతుందని.. అది పోయి ప్రజాస్వామిక పాలన రావాలని రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. దానికి స్పందించిన రాహుల్.. వ్యక్తులతో పాటు పాలన కూడా మారాల్సిన అవసరం ఉందని.. అదేవిధంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థనే నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌కు టీజేఎస్ తరపున తోడ్పాటు కావాలని ఆయన అడగటం జరిగిందని కోదండరాం తెలిపారు. ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై తమమధ్య చర్చ జరిగిందని... తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు.