సాగు నీటి ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది : ప్రియాంక గాంధీ - సంగారెడ్డి జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారం
Published : Nov 28, 2023, 2:18 PM IST
Priyanka Gandhi Election Campaign at Zaheerabad : రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదని ఆమె ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో పాల్గొన్న ప్రియాంక.. సాగు నీటి ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.
'సాగు నీటి ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. రూ.400 గ్యాస్ సిలిండర్ ధరను రూ.వెయ్యికి పైగా పెంచారు. తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. అన్నదాతలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేయలేదు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయి. తెలంగాణ ప్రజలు ఒవైసీ విమర్శలను గమనించాలి. మోదీ, కేసీఆర్‌ను ఏమీ అనని ఒవైసీ.. రాహుల్‌ను మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. దిల్లీలో బీజేపీకి బీఆర్‌ఎస్, ఎంఐఎం అన్ని విషయాల్లో సహకరిస్తాయి' అని ప్రియాంక పేర్కొన్నారు.