దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. హోటల్లో ఇడ్లీ తింటూ.. - కర్ణాటకలో ప్రియాంక గాంధీ ప్రచారం
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా.. స్థానిక హోటల్లో సందడి చేశారు. మైసూరులోని మైలారి అగ్రహార రెస్టారెంట్‌కు వెళ్లిన ప్రియాంక.. కిచెన్‌లో దోశలు వేశారు. స్వయంగా పిండిని కలిపి.. గుండ్రటి దోశలు వేశారు. అనంతరం దోశలను అట్లకాడతో తిప్పారు. ఆమె వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు అగ్ర నేతలు సైతం ఉన్నారు. ప్రియాంక రాకను చూసి హోటల్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రియాంకను ఆహ్వానిస్తూ.. ఆమె దోశలు వేయడాన్ని ఆసక్తిగా తిలకించారు. దోశలు వేసిన అనంతరం రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లతో ప్రియాంక గాంధీ ముచ్చటించారు. చిన్నారులతో కలిసి సరదాగా మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు అదే హోటల్లో టిఫిన్ చేశారు. ప్రియాంక సహా నేతలంతా ఇడ్లీలు ఆరగించారు. ప్రియాంక దోశలు వేస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'నైపుణ్యం కలిగిన చేతులు ప్రపంచానికి అంతులేని శక్తిని అందిస్తాయి' అని క్యాప్షన్ యాడ్ చేసింది.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరులో పర్యటిస్తున్నారు ప్రియాంక గాంధీ. తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ సైతం రాష్ట్రంలో తరచుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రాష్ట్రంలో 224 స్థానాలు ఉండగా.. 113 సీట్లు గెలిచిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది.