పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ద్రౌపది ముర్ము తెలంగాణ రాజకీయ వార్తలు
Published : Dec 20, 2023, 4:06 PM IST
President Draupadi Murmu At Pochampalli Tour :చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత కార్మికులు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించారు. పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్‌ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందన్నారు.
President Murmu Visit Bhoodan Pochampally : పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతానికి వచ్చి చీరలు నేసే విధానాన్ని చూడటం సంతోషంగా ఉందని తెలిపారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి కార్మికుల సమస్యలను, సలహాలను పరిగణలోకి తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తమ ప్రాంతం నుంచి కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడ కళను వారికి నేర్పిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.