గర్భిణీకి అనారోగ్యం.. రోడ్డులేక డోలీలోనే ఆస్పత్రికి.. నదిని దాటుతూ గ్రామస్థుల అవస్థలు
Pregnant Woman Carried On Doli : రోడ్డు సదుపాయం లేక అనారోగ్యంతో బాధపడుతున్న 7నెలల గర్భిణీని డోలీలో ఆస్పత్రికి తరలించారు ఆమె కుటుంబసభ్యులు. వారికి గ్రామస్థులు సాయమందించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
జిల్లాలో కుల్రోద్ గ్రామానికి చెందిన సురేఖ లాహు భాగ్డే అనే గర్భిణీకి వాంతులు అయ్యాయి. ఈ క్రమంలో సురేఖ.. తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సురేఖను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల డోలీపై తీసుకెళ్లాలని అనుకున్నారు. వెంటనే డోలీ తయారు చేసి.. ఉద్ధృతిగా ప్రవహిస్తున్న పింజాల్ నదిని దాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బ్రిడ్జ్ లేకపోవడం వల్ల నదిని దాటడానికి కుల్రోద్ గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత కొన్నాళ్లుగా కుల్రోద్ గ్రామానికి రోడ్డు, పింజాల్ నదిపై వంతెన నిర్మించాలని అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేదని స్థానికులు వాపోయారు.