సైనికుల గొప్ప మనసు.. మంచులో గర్భిణిని మోసి, ప్రత్యేక హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలింపు
భారత సైన్యం మరోసారి గొప్ప మనసును చాటుకుంది. జమ్ముకశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లాలో ఓ గర్భణిని కాపాడారు జవాన్లు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా అక్కడి రోడ్లన్నీ మూతపడ్డాయి. దీంతో నవపాచి ప్రాంతంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించడం క్లిష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న భారత సైన్యం వెంటనే అక్కడకు చేరుకుంది. దట్టంగా మంచుకురుస్తున్నా సరే.. ఆర్మీ బృందం ఆ గర్భిణిని రక్షించింది. ఆ మహిళను స్ట్రెచర్‌పై మోసుకుంటూ వెళ్లి.. ప్రత్యేక హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు జవాన్లు. భారత సైన్యం, వైమానిక దళ సిబ్బంది కలిసి ఈ పని చేశారు. గర్భిణి ప్రాణాలను రక్షించినందుకు స్థానికులు సైన్యం, వైమానిక దళానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో భారత సైన్యం ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడమే కాకుండా.. ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా ముందుంటుందని స్థానికులు తెలిపారు.